భీమ్గల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
ఆరో వార్డులో మురికి కాలువల శుభ్రత పనులు పరిశీలించిన చైర్పర్సన్, కమిషనర్
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం 6వ వార్డులో చేపట్టిన మురికి కాలువల శుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్పర్సన్ బోదిరె నాగమణి (స్వామి), మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ పరిశీలించారు.
పారిశుద్ధ్య సిబ్బంది పనులను వేగవంతం చేసి, పూర్తిస్థాయిలో శుభ్రత చర్యలు చేపట్టాలని వారు ఆదేశించారు. వర్షాల కారణంగా దోమల వ్యాప్తి, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను అన్ని వార్డుల్లో నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు పట్టణ ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
