7 న నిజామాబాద్‌లో జాబ్ మేళా

7 న నిజామాబాద్‌లో జాబ్ మేళా
- 50కి పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
- యువజన క్రీడల అధికారి బి పవన్ కుమార్
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన , క్రీడల అధికారి బక్కూరి పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖ, ఐటీఈ & సీ శాఖల సారథ్యంలో సుమారు 50కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత కోసం ఈ జాబ్ మేళాను ఈ నెల 7వ తేదీన నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్స్ (ఆర్మూర్ రోడ్)లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana/ వెబ్‌సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అవసరమైతే మేళా వేదిక వద్ద కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. పవన్ కుమార్ కోరారు.
