Vijaya-Dairy-Elections : ఈ విజయ డెయిరీ Andhra Prabha Spl Story
Vijaya-Dairy-Elections : ఈ విజయ డెయిరీ Andhra Prabha Spl Story
- రైతుల పాలకుండ
- సహకార స్ఫూర్తికి సజీవ సాక్ష్యం
- తాజాగా ఎన్నికల సందడి
- మూడు డైరెక్టర్ల పోస్టులకు
- నామినేషన్ల పర్వం
- కుదిరితే ఏకగ్రీవం
- లేదంటే 13న ఎలక్షన్ కోలాహలం
- రైతు స్వేధానికి ఇక్కడే గిట్టుబాటు
- ఆర్థిక క్రమశిక్షణకు గుర్తింపు
- అభివృద్ధి, పారదర్శక పాలనకు
- కొత్త పాలక వర్గమే దిక్చూచి
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ)

రైతు సహకార ఉద్యమానికి చిరునామాగా, పాల ఉత్పత్తిదారుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) మరో కీలక ఘట్టానికి సిద్ధమైంది. వేలాది మంది పాల ఉత్పత్తిదారుల ఆర్థికాభివృద్ధికి దశాబ్దాలుగా అండగా నిలుస్తున్న ఈ సహకార సంస్థలో ఖాళీ కానున్న మూడు జనరల్ డైరెక్టర్ల స్థానాలకు బుధవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించే ఈ ఎన్నికలపై పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘాల ప్రతినిధుల్లో ఆసక్తి నెలకొంది.
Vijaya-Dairy-Elections :రాష్ట్రంలో ప్రముఖం

రాష్ట్రంలోని ప్రముఖ సహకార పాల ఉత్పత్తిదారుల సంస్థల్లో విజయ డెయిరీకి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, నాణ్యమైన పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంలో ఈ సంస్థ విశేష పాత్ర పోషిస్తోంది. పాల ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని కూడా నిలబెట్టుకుంది.
Vijaya-Dairy-Elections : మూడు డైరెక్టర్ల పోస్టులకు …

ప్రస్తుతం పాలకవర్గంలో 19 మంది డైరెక్టర్లు ఉండగా, బాపులపాడు మండలం కాకులపాడుకు చెందిన చలసాని ఆంజనేయులు, గన్నవరం క్లస్టర్ వెంట్రాప్రగడకు చెందిన చలసాని చక్రపాణి, ఉయ్యూరు క్లస్టర్‌కు చెందిన అంజిరెడ్డి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. విజయ డెయిరీ క్షీరదర్శన్ హాలులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల అధికారిగా సహకార సంఘాల శాఖ విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎల్. గుర్నాథం వ్యవహరిస్తారు. ఆగస్టు 6న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మూడు స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైతే ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది. అంతకంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఆగస్టు 13న పోలింగ్ నిర్వహించనున్నారు.
Vijaya-Dairy-Elections : విస్తరిస్తున్నడెయిరీ

ఇటీవలి కాలంలో విజయ డెయిరీ మౌలిక సదుపాయాల విస్తరణ, పాల ప్రాసెసింగ్ సామర్థ్యాల పెంపు, రైతులకు మెరుగైన సేవల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరవల్లి కామధేను డెయిరీ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంతో పాటు, ఆ ప్రాజెక్టు కోసం తీసుకున్న సుమారు రూ.110 కోట్ల రుణాన్ని నిర్ణీత గడువుకంటే ముందుగానే తీర్చడం ద్వారా సంస్థ ఆర్థిక క్రమశిక్షణను చాటుకుంది. ప్రస్తుతం చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైతు సంక్షేమం, పాల ఉత్పత్తి పెంపు, నాణ్యత, మార్కెట్ విస్తరణ, సంస్థ ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తూ విజయ డెయిరీని మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. సహకార స్ఫూర్తితో ప్రారంభమైన విజయ డెయిరీ నేడు వేలాది పాల ఉత్పత్తిదారుల జీవనోపాధికి భరోసాగా నిలిచింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న డైరెక్టర్ల ఎన్నికలు కేవలం పాలకవర్గ మార్పు మాత్రమే కాకుండా, సంస్థ భవిష్యత్ అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతానికి దిశానిర్దేశం చేసే కీలక ఘట్టంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
