మెడిసిన్ లో కే.వి కుమార్తె అత్యుత్తమ ప్రతిభ
మెడిసిన్ లో కే.వి కుమార్తె అత్యుత్తమ ప్రతిభ
- కరోనా టైంలో కోచింగ్ లేకుండా నీట్ లో అత్యుత్తమ ర్యాంకు
- ఆపై ఎంబీబీఎస్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత
దమ్మపేట, ఆంధ్రప్రభ : అమ్మ ప్రాణం పోస్తే ,భగవంతుడు ఆయుష్షు ఇస్తే ,ఆ ప్రాణాన్ని కవచంలా కాపాడేది వైద్యులు .అలాంటి వైద్య విద్యను ఎంచుకుని , తల్లి దండ్రుల కష్టసుఖాలను అర్ధం చేసుకుని వైద్య విద్యలో ప్రతీ సంవత్సరం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ స్టేతస్కోప్ పట్టుకుని తాను కన్న కలను సాకారం చేసుకోబోతున్నది మన నవ యువ ధన్వంతరి కావ్య జాహ్నవి .మండల కేంద్రమైన దమ్మపేటకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యనారాయణ- రాధ దంపతుల ద్వితీయ కుమార్తె కేదాసి కావ్య జాహ్నవి ఎంబీబీఎస్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.
కావ్య 1 నుండి 5వ తరగతి వరకు దమ్మపేట లోని సెయింట్ మేరీస్ స్కూల్లో , 6 నుండి 10 వరకు గంగారంలోని డిఏవి స్కూల్లో , ఇంటర్ విజయవాడలోని చైతన్య కాలేజీలో చదివి అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. అనంతరం 2021 కరోనా టైంలో ఎటువంటి శిక్షణ లేకుండా నీట్ పరీక్ష రాసి పరీక్షలో 2100 ర్యాంకును సంపాదించి తల్లిదండ్రులతోపాటు అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. ఈ క్రమంలో హైదరాబాదులోని మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో ఎంబీబీఎస్ ఉచిత సీటుని కావ్య సాధించింది.
ఎంబీబీఎస్ లో ఉచిత సీటుని సాధించడమే కాకుండా నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ లో ప్రతి ఏటా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి మెరుగైన ప్రదర్శన కనపరిచింది. కష్టతరమైన నీట్ తో పాటుగా ఎంబీబీఎస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కావ్య జాహ్నవి తన తల్లిదండ్రులకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా మండలంలోని కేవీ సన్నిహితులు, మిత్రులు, పార్టీలకతీతంగా పలువురు నాయకులు కావ్య జాహ్నవి ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంబీబీఎస్ లో కావ్య జాహ్నవి ప్రతిభ పట్ల అన్ని వర్గాల నుండి విశేషమైన అభినందనల వెల్లువ సర్వత్రా కనబడటంతో తల్లిదండ్రులు కేవి సత్యనారాయణ, రాధ ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా కావ్య జాహ్నవి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, తనకు విద్యను నేర్పించిన గురువులు ఇచ్చిన స్ఫూర్తి ని, విద్యా బుద్ధులను అన్ని విధాల సద్వినియోగం చేసుకుని మెరుగైన ప్రదర్శనను ఇవ్వడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా డాక్టర్ వృత్తి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
