హునుమాన్ నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

  • 83 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం

నరసరావుపేట (వినుకొండ), ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నరసరావుపేట సబ్‌డివిజన్ పరిధిలోని వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధి హునుమాన్ నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమం శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ప్రజలకు భరోసా కల్పించడం లక్ష్యంగా చేపట్టారు.

కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా విభజించి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా నిర్వహించారు. హునుమాన్ నగర్‌లోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితులు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

గ్రామంలో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలోని రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు.

పాత కేసుల నిందితులతో ప్రత్యేకంగా సమావేశమైన పోలీసులు, గత పంథాను విడిచిపెట్టి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావుతో పాటు వినుకొండ సీఐ ప్రభాకర్, వినుకొండ రూరల్ సర్కిల్ సీఐ బ్రహ్మయ్య, వినుకొండ టౌన్ ఎస్‌ఐలు పుల్లారావు, ఉదయ్ లక్ష్మి, బొల్లపల్లి ఎస్‌ఐ సమీర్ బాషా తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.