గిరిపురంలో డయేరియా బాధితులకు పరామర్శ..

  • ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ధ్వజం
  • కిడ్నీలపై ప్రభావం.. ఆసుపత్రుల్లో దుర్భర పరిస్థితులు
  • ప్రజల ఆరోగ్యం కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర విఫలం
  • మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

పాయికాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో గత రెండు రోజులుగా డయేరియా తీవ్రంగా విజృంభిస్తోందని, ప్రజా రోగ్యాన్ని కాపాడటంలో నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గిరిపురంలో డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని ఆయన శనివారం స్థానిక మాజీ కార్పొరేటర్ కుక్కల అనిత తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడ్డారు. ​కలుషిత నీరు, అధ్వాన్నమైన పారిశుధ్యమే కారణం గిరిపురం పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలు పూడుకుపోయి, పారిశుధ్యం పూర్తిగా క్షీణించిందన్నారు.

పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడం వల్లే ఇక్కడ డయేరియా ప్రబలిందని స్పష్టమవుతోందన్నారు. నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. స్థానికులు వారం రోజులుగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలోనూ ఇదే తరహాలో డయేరియాతో పలువురు మృతి చెందడం, అస్వస్థతకు గురికావడం చూశాం..ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కనే ఈ సమస్య వేధిస్తున్నా, జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ పట్టించుకోకపోవడం అత్యంత విచారణకరం అన్నారు.

ప్రస్తుతం గిరిపురంలో 20 మందికి పైగా డయేరియా బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారని, డీహైడ్రేషన్ కారణంగా కొందరిలో కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకపక్క కరోనా భయాలు, మరోపక్క మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే రోగులకు కనీసం స్ట్రెచర్లు లేవు, మందుల కొరత వేధిస్తోందన్నారు. పైగా అక్కడ లంచాలు అడుగుతున్నారని, వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

గత ప్రభుత్వంలో సుమారు 60 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండేవి, కానీ కూటమి ప్రభుత్వంలో పేద రోగులకు ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకుని అప్పులపాలు కావాల్సి వస్తోందన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలో ఉందని మండిపడ్డారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్నా డ్రైన్లు క్లీన్ చేయడానికి అధికారుల వద్ద ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, తక్షణమే గిరిపురంతో పాటు నగరంలోని అన్ని ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి, సురక్షిత నీటిని సరఫరా చేయాలన్నారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు, బాధితుల పక్షాన నిలబడేందుకు సీరియస్‌గా తదుపరి చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

విజయవాడ నడిబొడ్డున మళ్లీ డయేరియా పంజా..

​చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితం.. గిరిపురంలో డయేరియా కలకలంపై అధికారుల నిర్లక్ష్యం, పారిశుధ్య లోపమే కారణమంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని రక్షించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోందన్నారు. చెత్త నుండి సంపద సృష్టిస్తాం.. అంటే ఇదేనా అన్నారు. గుడివాడలో ఈరోజు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దల మాటలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా పోయిందన్నారు.

చెత్తను సమర్థవంతంగా నిర్వహించకుండా ప్రజలకు డయేరియా లాంటి ప్రాణాంతక రోగాలను కానుకగా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న గిరిపురంలో డయేరియా మహమ్మారి మళ్లీ పంజా విసిరిందన్నారు. మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వాటర్ సప్లై విభాగం, సైడ్ డ్రైన్స్ ఇంజనీరింగ్ ఘోర నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. డ్రైనేజీల నిర్వహణ లోపం, కలుషిత నీటి సరఫరా కారణంగానే గిరిపురం ప్రజలు అనారోగ్యం పాలయ్యారని, దీనికి ప్రభుత్వ యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో రెండోసారి ఘోరం, నివారణ చర్యలు శూన్యం…

​గతంలో విజయవాడ నగరంలోని న్యూ ఆర్ఆర్ పేటలో డయేరియా బారిన పడి కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఆ ఘోర కలకలం మరువక ముందే, ఇప్పుడు రెండోసారి గిరిపురంలో అదే తరహా డయేరియా ప్రబలడం నగర ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. మున్సిపల్ యంత్రాంగం మొదటి ఘటన నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ఈ సంఘటన రుజువు చేస్తోందని మల్లాది విష్ణు చెప్పారు. ప్రభుత్వం ఒకవైపు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ ఊరూరా తిరుగుతూ, ప్రచారాల కోసం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తోందే తప్ప, ఆచరణలో… క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం శూన్యమని విమర్శించారు.

విజయవాడ నగరంలోని సైడ్ డ్రైన్లను ఒక్కసారి పరిశీలిస్తే, టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తాచెదారం, నిలిచిపోయిన మురుగు నీరు దర్శనమిస్తాయని, ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి బాస్కెట్ కలెక్షన్ ఇవ్వాలని ప్రజలకు సుద్దులు చెప్పే కూటమి ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను మాత్రం గాలికొదిలేసిందన్నారు.

అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేస్తామన్న హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, కూటమి ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం గడప దాటడం లేదని, ఈ ఫెయిల్యూర్ విధానాల వల్లే ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని తెలిపారు. ​ప్రజా సంకల్పాలు, స్వర్ణాంధ్ర నినాదాల వెనుక దాగి ఉన్న అసలు వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని, గిరిపురం బాధితులకు ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కుక్కల రమేష్, చంటి, సమూయేలు, మనోహర్, నిరీక్షన్, మరియ రాణి, కుమారి, జాన్సీ, భాను, చందు, రత్నా తదితరులు పాల్గొన్నారు.