Bear Scare | కడుతుల గ్రామంలో కలకలం..
Bear Scare | కడుతుల గ్రామంలో కలకలం..
Bear Scare | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కడుతుల గ్రామంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామ శివారులో అకస్మాత్తుగా ఎలుగుబంటి కనిపించడంతో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కూలీలు పరుగులు తీశారు. కొంతసేపు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఎలుగుబంటి కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు, గ్రామస్తులు ఎలుగుబంటిని అడవి వైపు తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో ఎలుగుబంటి కొంతసేపు గ్రామ పరిసరాల్లో తిరుగుతూ హల్‌చల్ చేసింది.

గ్రామస్తులు దగ్గరకు వెళ్లడంతో ఎలుగుబంటి వారిపైకే దూసుకొచ్చేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామ పరిసరాల్లో వన్యమృగాల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎలుగుబంటి మళ్లీ గ్రామంలోకి రాకుండా పర్యవేక్షణ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
