మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

కోడూరు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకుని, రోగుల పరిస్థితిని ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఓపీ విభాగాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై సమాచారం సేకరించారు.
ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు, ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారిణి డాక్టర్ కే. శిరీష ఎమ్మెల్యేకు వివరించారు. కుక్కకాటు, పాముకాటు చికిత్సలకు అవసరమైన ఇంజెక్షన్లు, ఇతర మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
అయితే ఒక వైద్యాధికారి పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎం.పీ.హెచ్.ఈ.ఓ వీవీ సుబ్బారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
