జయంతిలో భారీ చోరీ

తాళాలు పగలగొట్టి 40 లక్షల బంగారం అపహరణ
వీరులపాడులో సంచలనం
( వీరులపాడు, ఆంధ్రప్రభ) తాళాలు పగులగొట్టి 40 లక్షల బంగారాన్ని అపహరించిన ఘటన వీరులపాడు మండలం జయంతి గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావుల అయ్యప్ప రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని అగంతకులు ఇంటికి తాళం, బీరువా పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు బాధితులు వీరులపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఇన్చార్జి ఎస్ఐ కిరణ్ క్లూస్ టీంమ్, డాగ్ స్క్వాడ్ తో కలిసి పరిశీలించారు. బాధితుల నుండి వివరాలను నమోదు చేసుకున్నారు.

రావుల అయ్యప్ప రెడ్డి వృత్తి రీత్యా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. అతని భార్య సంధ్యారాణి తన కుటుంబ సభ్యుల వివాహం నిమిత్తం గడచిన శుక్రవారం ఉదయం గుంటూరు కుమారుడితో కలిసి వెళ్లారు. ఈరోజు ఉదయం అయ్యప్ప రెడ్డి గ్రామంలో ఉన్న తన పొలం వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే క్రమంలో ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. తిరిగి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి వద్దకు రాగానే ఇంటి తాళాలు బీరువా పగలగొట్టి ఉండడంతో కేకలు వేసి చుట్టుపక్కల ఉన్న తన బంధువులకు సమాచారాన్ని తెలియజేశాడు. బీరువాలో 170 గ్రాముల బంగారం, 40,000 నగదు కనిపించడం లేదని తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.
