నిరుపేదలకు ఆరోగ్య భరోసా…
55 కుటుంబాలకు రూ.67.74 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఎంపీ కేశినేని చిన్ని చొరవతో వైద్య సహాయం…
( విజయవాడ ఆంధ్రప్రభ) : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 55 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.67.74 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్), ఎల్వోసీ చెక్కులను ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు మంగళవారం ఎంపీ కార్యాలయం ద్వారా పంపిణీ చేశారు.
అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. వైద్య చికిత్స డబ్బుల కొరతతో ఆగిపోకుండా చూడటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ కింద మొత్తం రూ.67,74,344 విలువైన చెక్కులను అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆపద సమయంలో ప్రభుత్వం అందించిన సహాయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ కేశినేని చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కార్యాలయం స్పందించి త్వరితగతిన వైద్య సహాయం అందించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భావకుమార్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ఎర్నేని వేదవ్యాస్, శాప్ డైరెక్టర్ సంతోష్, రేగళ్ల లక్ష్మణరావు, పాల మాధవ్, కొండ, అబిద్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
