చిన్నారుల చిరునవ్వుకు శ్రీదంత్ భరోసా..
- లక్ష మంది విద్యార్థుల దంత ఆరోగ్యానికి మరో ముందడుగు
- ఉచిత పరీక్షలు, వైద్య సేవలు అభినందనీయం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
(విజయవాడ, ఆంధ్రప్రభ) : చిన్నారుల నవ్వు నిండుగా.. దంత ఆరోగ్యం మెండుగా ఉండాలనే సంకల్పంతో పాఠశాల విద్యార్థులకు డా. శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత దంత ఆరోగ్యం, వైద్య సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం నగరంలోని పటమట కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో డా. శ్రీధర్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదంత్ స్కూల్ డెంటల్ హెల్త్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఇప్పటివరకు ఫౌండేషన్ ద్వారా 12 లక్షల మందికిపైగా పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించినట్లు డా. అరుమళ్ల శ్రీధర్‌రెడ్డి వివరించారు.

ఇప్పుడు మరో ముందడుగుగా లక్ష మంది పిల్లల దంత ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమం గురించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు దంత ఆరోగ్యం ఎంతో కీలకమని.. దంత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య ఆంధ్ర సాకారంలో డా. శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అందిస్తున్న భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమన్నారు.
ఆరోగ్యవంతమైన చిరునవ్వుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ అన్నారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు డా. శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. లక్ష మంది విద్యార్థుల దంత ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యవంతమైన దంతాలతో, అందమైన చిరునవ్వుతో ఎదగాలని ఆకాంక్షిస్తూ, తల్లిదండ్రులు కూడా పిల్లల దంత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
