మండలి వెంకట కృష్ణారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శం

  • కలెక్టర్ జి. లక్ష్మీశ
  • జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘన నివాళి
  • గాంధేయ విలువలు, త్యాగం, ప్రజాసేవకు ప్రతీకగా కొనియాడిన కలెక్టర్

(విజయవాడ, ఆంధ్రప్రభ) : స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గాంధేయ విలువలు, త్యాగం, ప్రజాసేవకు చిరస్మరణీయ ప్రతీక అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా మంగళవారం విజయవాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరాడంబర జీవనం, నిస్వార్థ సేవ, నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొని లాఠీదెబ్బలు, అరెస్టులను ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన, భూదానోద్యమ స్ఫూర్తితో తనకు లభించిన ఐదు ఎకరాల భూమిని పేదలకు దానం చేసి మానవతా దృక్పథాన్ని చాటారని తెలిపారు.

రైతుల సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు లోక్‌సభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా, పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజాసేవలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. విద్యా, సాంఘిక సంక్షేమం, మత్స్యశాఖల అభివృద్ధికి సంస్కరణలు అమలు చేయడంతో పాటు నాగార్జున, కాకతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు విశేష కృషి చేశారని చెప్పారు.

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలుగు భాష, సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని, 1977 దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా సమన్వయం చేసి బాధితులకు అండగా నిలిచారని కలెక్టర్ గుర్తు చేశారు. గాంధీ క్షేత్రం ద్వారా విద్య, సేవా, ఉపాధి కార్యక్రమాలను విస్తరించి వేలాది కుటుంబాలకు చేయూత అందించారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహ, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొని మండలి వెంకట కృష్ణారావుకు ఘనంగా నివాళులర్పించారు.