New Projects | తెలంగాణ‌కు కేంద్రం వ‌రాలు – కవచ్, మిల్లెట్స్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్న‌ల్

హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులను కేటాయించింది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్’ (అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రం) తో పాటు, రైల్వే రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ఈ విషయాలను తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పుతారని ఆయన వివరించారు. ఈ కేంద్రం ద్వారా చిరుధాన్యాలకు సంబంధించిన పరిశోధనలు ముమ్మరంగా సాగుతాయని, వాటి ఉత్పత్తిని పెంచడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన రైల్వే రక్షణ వ్యవస్థ అయిన ‘కవచ్’ ప్రాజెక్టుకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాల ద్వారా హైదరాబాద్ నగరం వ్యవసాయ పరిశోధనలతో పాటు, రైల్వే భద్రతా సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఒక ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు నగరానికి మరింత గుర్తింపును తీసుకురావడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా పెంపొందిస్తాయని భావిస్తున్నారు.

యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్

తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఎంఎంటిఎస్ ఫేజ్–2 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైందని, . రూ. 400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Leave a Reply