యూరియా సరఫరా, ధాన్యం రవాణా సజావుగా సాగాలి

యూరియా సరఫరా, ధాన్యం రవాణా సజావుగా సాగాలి

  • రైల్వే హమాలీల సమస్యలు పరిష్కరిస్తాం
  • పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన

పెద్దపల్లి, ఆంధ్రప్రభ:
రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా, ధాన్యం రవాణా ప్రక్రియలు సజావుగా సాగేలా చూడాలని పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లోని యూరియా బస్తాల అన్‌లోడింగ్ ప్రాంతాన్ని ఆయన సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీసీపీ రాంరెడ్డి సంబంధిత అధికారులతో పాటు హమాలీలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణా కోసం అధిక సంఖ్యలో లారీలను వినియోగిస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే యూరియా ఎరువుల రవాణాకు కొంత ఇబ్బంది ఎదురవుతోందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిపారు. పంటల రవాణాకు ఆటంకం కలగకుండానే, రైతులకు అవసరమైన యూరియా సరఫరా కూడా నిలిచిపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

హమాలీల కోసం చలివేంద్రం ఏర్పాటు ..
ఎండల తీవ్రత దృష్ట్యా రైల్వే వ్యాగన్ల నుండి యూరియా బస్తాలను లారీల్లోకి ఎక్కిస్తూ శ్రమిస్తున్న హమాలీల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డీసీపీ రాంరెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు మరియు రైల్వే హమాలీలు పాల్గొన్నారు.

Leave a Reply