’గుడ్ మార్నింగ్ తిరువూరు’లో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే

’గుడ్ మార్నింగ్ తిరువూరు’లో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే

-ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా
-డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై అధికారులకు ఆదేశాలు
-తోకపల్లి వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం

తిరువూరు, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ‘గుడ్ మార్నింగ్ తిరువూరు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 4వ వార్డు తోకపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజల మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితి, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పలు మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్న ఎమ్మెల్యే, ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.

తోకపల్లి ప్రాంతంలో చాలా కాలంగా సమస్యగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న రహదారులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణ ఉపశమనంగా నీరు నిల్వ కాకుండా ఖచ్చా డ్రైనేజీ తవ్వకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా శాశ్వత పరిష్కారంగా కొత్త సిమెంట్ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి పరిపాలనా అనుమతులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మనోజ్‌కు సూచించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం లేదా జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో తిరువూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. స్థానికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్వయంగా వచ్చి పరిశీలించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply