రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు
-సమస్యలను వెంటనే పరిష్కరించాలి
-తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు
-దళారుల దోపిడీపై ఎమ్మెల్యే ఆగ్రహం
-రైతు సమస్యలపై కలగరలో ప్రత్యక్ష పరిశీలన
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి దాన్యపు గింజలను కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్నిదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా రంగంలోకి దిగి పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను నిలదీశారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామపంచాయతీలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమాచారం అందడంతో గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
గత 15 రోజులుగా రైతులకు గన్ని సంచులు అందకపోవడం, ధాన్యం తరలింపునకు లారీలు పంపకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన శ్రీనివాసరావు, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నప్పటికీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించకుండా, దళారులకు అనుకూలంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు రాత్రింబవళ్లు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని, మధ్యవర్తుల ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరగతి రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
“రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను… రైతుల చెమటకు విలువ రావాలి” అంటూ అధికారులను గట్టిగా హెచ్చరించిన ఎమ్మెల్యే, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కష్టకాలంలో తమ సమస్యలను తెలుసుకుని గ్రామానికి వచ్చి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
