AP Cabinet Decisions | ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions | ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions | అమరావతిలో లండన్ ఐ తరహా అమరావతి ఐ ప్రాజెక్టు
2026-31 ఏపీ ఏవియేషన్ పాలసీకి ఆమోదం
రాష్ట్రంలో 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్
శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
జిల్లాల వారీగా భారీ భూకేటాయింపులు
క్వాంటం వ్యాలీకి రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు
పోలవరం కాలువ పనులకు రూ.796.66 కోట్ల అనుమతి

AP Cabinet Decisions | అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాజధాని అమరావతి అభివృద్ధి, పారిశ్రామికీకరణ, విమానయాన రంగ విస్తరణ, గ్రామీణ ఉపాధి, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించిన నిర్ణయాల్లో అమరావతిలో ‘అమరావతి ఐ’, కొత్త ఏవియేషన్ పాలసీ, శ్రీ సిటీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, క్వాంటం వ్యాలీ, పోలవరం పనులు, యోగా పరిషత్, అగ్రిగోల్డ్ ప్రత్యేక కోర్టు, భారీ స్థాయిలో భూకేటాయింపులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ పాల్గొన్నారు.

రాజధాని అమరావతిలో పర్యాటక ఆకర్షణగా నిలిచే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా నది ఒడ్డున సీఆర్డీఏకు చెందిన ఆరు ఎకరాల భూమిలో డీబీఎఫ్‌టీ విధానంలో ఈ భారీ అబ్జర్వేషన్ వీల్‌ను నిర్మించనున్నారు. లండన్‌లోని ‘లండన్ ఐ’ తరహాలో రూపొందనున్న ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి నగర అందాలు, కృష్ణా నది పరిసరాలను ఎత్తైన ప్రదేశం నుంచి వీక్షించే అవకాశం పర్యాటకులకు లభించనుంది. 30 సంవత్సరాల కన్సెషన్ కాలానికి టెండర్లు పిలవనున్నారు.

అలాగే 2026-31 కాలానికి ఏపీ ఏవియేషన్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్, రాష్ట్రంలో ప్రతి 150 కి.మీ పరిధిలో విమానాశ్రయ సౌకర్యం, ఎంఆర్‌ఓ, ఏరోస్పేస్ రంగాల్లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ఏటా 5,000 మందికి శిక్షణ, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.

జూలై 1 నుంచి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ కేసుల వేగవంతమైన విచారణ కోసం విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు 21 కొత్త పోస్టులను మంజూరు చేశారు. హైకోర్టు, సీఐడీ అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పర్యాటక రంగ ప్రోత్సాహంలో భాగంగా బీచ్ షాక్స్‌కు ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఆమోదించారు. తొలి దశలో విశాఖపట్నం – 2 షాక్స్, చీరాల – 2 షాక్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఈ నెల 7 నుంచి 21 వరకు నిర్వహించనున్న యోగాంధ్రకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

అవయవాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్-2011’ అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. అమరావతి హైకోర్టు అభివృద్ధికి రూ.547 కోట్ల కేటాయింపులకు ఆమోదం లభించింది.

శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం

తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రూ.250 కోట్ల పెట్టుబడితో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ’ స్థాపనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచస్థాయి విద్య, పరిశోధనలు, స్టార్టప్ ఇంక్యుబేషన్, పరిశ్రమల అనుసంధానం, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలపై దృష్టి సారించనుంది. నాన్ మెడికల్ కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాకు కేటాయించనుంది.

జిల్లాల వారీగా భూ కేటాయింపులు

అమరావతి – గుంటూరు: అమరావతి ఐ కోసం 6 ఎకరాలు, క్వాంటం వ్యాలీకి 49.66 ఎకరాలు, ఏపీఐఐసీ కన్వెన్షన్ సెంటర్‌కు 8 ఎకరాలు, గుంటూరు వట్టిచెరుకూరులో 25.37 ఎకరాల భూమి వర్గీకరణ మార్పు.

తిరుపతి: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి 60 ఎకరాలు, శాంతిపురం మండలంలో ఏపీఐఐసీ విస్తరణకు 4.94 ఎకరాలు, గుడుపల్లెలో ఇండస్ట్రియల్ పార్కుకు 12.75 ఎకరాలు, హెచ్‌పీసీఎల్ పంపింగ్ స్టేషన్‌కు 11.96 ఎకరాలు.

విశాఖపట్నం: మాధురవాడలో పర్యాటక ప్రాజెక్టులకు 9.39 ఎకరాలు. బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టు.

అనకాపల్లి జిల్లా: టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాలు.

కాకినాడ జిల్లా: జిల్లా కార్యాలయ నిర్మాణానికి 1.45 ఎకరాలు.

కృష్ణా: మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు రోడ్డు, రైలు కనెక్టివిటీకి 0.58 ఎకరాలు, యూనియన్ బ్యాంక్ రీజినల్ ఆఫీస్‌కు 0.50 ఎకరాలు, చల్లపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు 11.80 ఎకరాలు.

నెల్లూరు: పరిహార వనీకరణ కోసం అటవీ శాఖకు 14.10 ఎకరాలు.

చిత్తూరు: మహాదేవమంగళం ఫీడర్ లెవల్ సోలారైజేషన్ ప్రాజెక్టుకు 46.69 ఎకరాలు.

వైఎస్సార్ కడప: పునరుత్పాదక ఇంధన రంగంలో వివిధ కంపెనీలకు అత్యధిక కేటాయింపులు. కడప జిల్లాలోనే సుమారు 496 ఎకరాలకు పైగా భూమి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు కేటాయించబడింది.

అనంతపురం: పవర్ గ్రిడ్ అనంతపురం-కర్నూలు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుకు 33 ఎకరాలు కేటాయించారు.

క్వాంటం వ్యాలీకి ఊతం

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో సుమారు రూ.5.53 కోట్ల భారం తగ్గి, ఆ నిధులను పరిశోధన, ఆవిష్కరణల కోసం వినియోగించే అవకాశం ఏర్పడింది.

పోలవరానికి నిధులు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీ-5, 5ఏ పనులకు రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలన అనుమతి మంజూరైంది. చేపట్టే పనుల్లో కాలువ తవ్వకం, గట్ల నిర్మాణం, కాలువ లైనింగ్, క్రాస్ డ్రైనేజీ పనులు ఉన్నాయి.