విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన..

మోత్కూర్, ఆంధ్రప్రభ : స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో, యూనిసెఫ్, మహిత చైల్డ్ రైట్స్ ఫర్ అలయన్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమవారం మోత్కూర్ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల/జూనియర్ కళాశాల (బాలుర)లో ‘గుడ్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన ఎస్‌డీజీ-3 (మంచి ఆరోగ్యం–సంక్షేమం)పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా స్కోప్ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య మాట్లాడుతూ, కౌమారదశలో వచ్చే మార్పులు, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, క్రీడలు, తగిన నిద్ర, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు.

చైల్డ్ రైట్స్ ఫర్ అలయన్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన జీవనం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎన్. వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కోప్, మహిత, చైల్డ్ రైట్స్ ఫర్ అలయన్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సానుకూల మార్పుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. సారంగపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.