విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని బీసీ వసతి గృహాల టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువే సర్వస్వంగా భావించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులు అన్నారు. ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని వసతి గృహాలన్నింటినీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సహకారంతో డీఎంఎఫ్ నిధులతో అన్ని మరమ్మత్తులు చేయించి, విద్యార్థులకు భద్రత, సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో సౌకర్యాలు పెరగటంతో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని బీసీ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరంలో 120 మందికి గాను అత్యధికముగా 104 మంది పాస్ కావటం గర్వకారణం అన్నారు.
వీరిలో తలగడదీవి హాస్టల్ బాలికలు 575, 571 మార్కులతో బీసీ వసతి గృహాల కేటగిరిలో జిల్లా మొదటి, రెండవ స్థానాలు సాధించటం ప్రశంసనీయం అన్నారు. ఉత్తీర్ణులైన 104 మందిలో 86 మంది ఫస్ట్ క్లాస్, 16మంది సెకండ్ క్లాస్, ఇద్దరు థర్డ్ క్లాసులో ఉత్తీర్ణులు కావడం వార్డెన్లు వహించిన శ్రద్ధకు, విద్యార్థుల పట్టుదలకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు సైతం సన్నబియ్యంతో ఆహారం అందించి వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. వసతి గృహాల్లో ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే తన దృష్టికి తీసుకొని వస్తే అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కోడూరు బీసీ బాలుర వసతి గృహం, చల్లపల్లి, అవనిగడ్డ బీసీ బాలుర వసతి గృహాలు, తలగడదీవి బీసీ బాలికల వసతి గృహం, అవనిగడ్డ బీసీ బాలికల వసతి గృహం, నాగాయలంక బీసీ బాలికల వసతి గృహం, మోపిదేవి బీసీ బాలుర వసతి గృహాల టెన్త్ టాపర్లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సత్కరించి, నోట్ బుక్స్, మిఠాయిలు అందచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జీ.రమేష్,ఏబీసీడబ్ల్యూఓ మహమ్మద్ షహతుల్లా, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎస్.సురేష్, టీ.నాగమణి, సీహెచ్.దుర్గా రాణి, ఎం.వనజ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
