కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను అడ్డుకోవాలి

  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 282 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల సవరణ కార్యక్రమంలో ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల హక్కులను పరిరక్షించడం, వారికి అవసరమైన సహకారం అందించడం పార్టీ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.

“సర్” ప్రక్రియ ముగిసే వరకు నాలుగు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తామని, జూలై 6న మరో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను లోతుగా చర్చిస్తామని తెలిపారు. ప్రతి సమావేశానికి బీఎల్‌ఏలు, ఇంచార్జ్‌లు, గెలిచిన, ఓడిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. 282 మంది బీఎల్‌ఏలు, ఇంచార్జ్‌లు పూర్తిస్థాయిలో సమయం కేటాయించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించాలని కోరారు.

వారికి అందజేసిన గుర్తింపు కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపుల కారణంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ప్రజల ఆశయాలకు అనుగుణమైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, పార్లమెంట్ ఇంచార్జ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, చెనగాని దయాకర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోబాజీ అనంత కిషన్, సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.