మెమో 57 అమలుతో ఉపాధ్యాయ కుటుంబాల్లో ఆనందం

సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో మెమో నంబర్-57 అమలుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా బుధవారం ఉరవకొండ పట్టణంలోని కవిత హోటల్ సర్కిల్ వద్ద “థాంక్యూ సీఎం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు.

2003 డీఎస్సీ ఫోరం ఉరవకొండ కన్వీనర్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ శేఖర్, జేఏసీ నాయకులు గురుప్రసాద్, రామప్ప చౌదరి, ఆలూరు కృష్ణ మాట్లాడుతూ, 2003 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ఆలస్యంగా నియామకాలు పొందిన 7,300 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో కొనసాగుతున్నారని తెలిపారు.

పాత పెన్షన్ విధానానికి అర్హులైన వీరికి ఓపీఎస్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో-57ను అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వాలను కోరుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం సమస్య న్యాయమైనదని గుర్తించినప్పటికీ అమలు చేయలేదన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్యను న్యాయబద్ధమైనదిగా గుర్తించి, దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపారని కొనియాడారు. ఈ నిర్ణయంతో సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఆనందం నెలకొందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయ ఫోరం నాయకులు మహేష్ కుమార్, హరి, యుగంధర్, శ్రీదేవి, జేఏసీ నాయకులు గురుప్రసాద్, జగన్నాథ్, ప్రసాదరావు, పర్వతప్ప, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బీసీ ఓబన్న, శ్రీనివాసులు, సంజీవ, భువనేశ్వర్ చౌదరి, రఘు, ప్రసన్న కుమార్, సాకే మునిస్వామి, ఆది, రాజేష్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, అజయ్, రెడ్డి లోకేష్, రాము, మహిళా నాయకులు శ్రీదేవి, కవిత, లావణ్య, వరలక్ష్మి, నాగవేణి, ఎర్రిస్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.