ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బోధన

  • ప్రైవేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టి మోసపోవద్దు
  • జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి బోధనతో పాటు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ అన్నారు.బుధవారం కన్కల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు మంచి అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజన వసతులను కల్పిస్తోందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు మండల టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.అనంతరం పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, తాగునీటి వసతులు, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, పులగం సాయి రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.