సీనియర్ల సలహాలతో పార్టీని బలోపేతం చేయాలి: వేముల వీరేశం

చిట్యాల, ఆంధ్రప్రభ: కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన చిట్యాల మండల అధ్యక్షుడిగా జడల చిన్నమల్లయ్య, చిట్యాల పట్టణ అధ్యక్షుడిగా ఎద్దులపూరి కృష్ణను నియమించారు. బుధవారం ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కలిసి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి మండలం, ప్రతి పట్టణంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతోందని, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

నూతనంగా ఎన్నికైన పట్టణ, మండల అధ్యక్షులు ఎద్దులపూరి కృష్ణ, జడల చిన్నమల్లయ్యలను ప్రభుత్వ విప్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీరికి అభినందనలు తెలిపిన వారిలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందిరి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, మారగోని అంజనేయులు, ఆవుల సుందర్ యాదవ్, ఆవుల యాదయ్య, మల్లెబోయిన మల్లేష్, కొసనం అశోక్, మెట్టు మనోహర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.