“డ్రగ్స్ వద్దు బ్రో… కుటుంబం ముద్దు బ్రో” నినాదంతో దద్దరిల్లిన నందికొట్కూరు
జూనియర్ కళాశాల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల పిలుపు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నందికొట్కూరులో బుధవారం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షియోరాన్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పర్యవేక్షణలో, నందికొట్కూరు టౌన్ యూపీఎస్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఎస్పీ సునీల్ షియోరాన్ ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ రఘురామాచార్యులు, జువాలజీ లెక్చరర్ సురేష్, తెలుగు లెక్చరర్ నరేంద్ర, బోధనా సిబ్బంది, 120 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల నుంచి మిడ్తూరు రోడ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
“డ్రగ్స్ వద్దు బ్రో… కుటుంబం ముద్దు బ్రో” అనే నినాదాలతో విద్యార్థులు పట్టణ వీధుల్లో అవగాహన కల్పించారు. “ఒక్కసారి తీసుకున్న మత్తు జీవితాన్నే తీసేస్తుంది” వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 100 నంబర్లకు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని వివరించారు.
మాదకద్రవ్యాలు వ్యక్తిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలకు గురైన వారు రెండు గంటలలోపు 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని సూచించారు.
పోక్సో చట్టం కింద చిన్నారులపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, బాల్య వివాహాల సమాచారం 1098 చైల్డ్‌లైన్‌కు అందించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో ఆత్మకూరు శక్తి టీం సిబ్బంది విద్యార్థుల మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, అత్యవసర పరిస్థితుల్లో దానిని ఎలా ఉపయోగించాలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎస్పీ సునీల్ షియోరాన్, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్‌లకు కళాశాల యాజమాన్యం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ సునీల్ షియోరాన్ నాయకత్వంలో నంద్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
