రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  • జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ చందర్

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ చందర్ పిలుపునిచ్చారు.బుధవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో విత్తన మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు.ఈ విత్తన మేళాలో సన్న వడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి అధునాతన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన మేర యూరియాను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయశాఖ సంచాలకులు శ్రీదేవి, మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు మౌనిక, విత్తన డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.