డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా

డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా
- శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ ఆదేశం
- ఆరాధనోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు
పుట్టపర్తి, ఆంధ్రప్రభ: శ్రీ సత్య సాయి బాబా ఆరాధనోత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు, వీవీఐపీలు భారీగా తరలివస్తుండటంతో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా గగనతలం నుంచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హిల్ వ్యూ స్టేడియం, నారాయణ సేవ ప్రాంగణం, ప్రధాన రహదారులు మరియు పార్కింగ్ ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలను తక్షణమే గుర్తించేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.
మహిళా పోలీసుల మోహరింపు: భక్తుల సౌకర్యార్థం మరియు భద్రత కోసం భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇందులో భాగంగా మహిళా పోలీసులను కూడా విస్తృతంగా విధుల్లో నియమించారు.
హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహిస్తున్న నారాయణ సేవ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పట్టణమంతా నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
