ఆర్టీసీ డ్రైవర్ మృతి పై భూపాలపల్లిలో ఆందోళన

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై భూపాలపల్లి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా శుక్రవారం భూపాలపల్లి ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ కూడలి వరకు సాగింది.

ర్యాలీలో ఆర్టీసీ కార్మికులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని విమర్శించారు. కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య సాధారణ ఘటన కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిఫలమని వారు పేర్కొన్నారు.

“ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ఇకపై కూడా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

Leave a Reply