విత్తన దుకాణలను తనిఖీ చేసిన ఏవో..
పరకాల, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పరకాల మండలంలోని విత్తన దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) సోమరాత్రి శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విత్తన డీలర్లకు పలు సూచనలు చేశారు. రైతులకు స్పష్టంగా కనిపించే విధంగా స్టాక్ బోర్డులు, లైసెన్స్ ప్రతులను దుకాణాల్లో ప్రదర్శించాలని, అలాగే విక్రయించే ప్రతి విత్తనానికి తప్పనిసరిగా బిల్లు ఇచ్చి, రైతుల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం రైతులకు ఏవో శ్రీనివాస్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మండలంలో సరిపడా వర్షపాతం నమోదు కాలేదని, ఇప్పటివరకు కేవలం స్వల్ప వర్షాలు మాత్రమే కురిశాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడి ముఖ్యంగా పత్తి విత్తనాలు విత్తితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా మొలక శాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.
అందువల్ల రైతులు సరిపడా వర్షాలు కురిసే వరకు ఎలాంటి విత్తనాలు విత్తకుండా వేచి ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనించి, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని కోరారు.
