గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
- చిన్నకోడేపాకలో బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
రేగొండ, ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం విజయపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల సమస్యలను గుర్తించి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడమే గ్రామసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు సంక్షేమ పథకాలు సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయో లేదో గ్రామస్థులు పరిశీలించాలని సూచించారు.
గ్రామ స్థాయి నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చిన్నకోడెపాక–ప్రగతి సింగారం బస్సు సర్వీసు ప్రారంభం
పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చిన్నకోడెపాక నుంచి ప్రగతి సింగారం వరకు కొప్పుల, వసంతపూర్ మీదుగా నడిచే కొత్త బస్సు సర్వీసును డిపో మేనేజర్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సులో కొంతదూరం టికెట్ తీసుకుని ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చిన్నకోడెపాక, కొప్పుల, వసంతపూర్, ప్రగతి సింగారం గ్రామాల ప్రజలు చాలా కాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారని, వారి విజ్ఞప్తి మేరకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ బస్సు సర్వీసు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు, తాగునీరు, విద్యుత్‌తో పాటు రవాణా సదుపాయాలు కూడా కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాధు సుమలత, కాంగ్రెస్ నాయకులు సుదనబోయిన ఓం ప్రకాష్, తోకల సురేందర్ రెడ్డి, మొట్టే కిరణ్, ముడతనపల్లి శంకర్, పంగ ఐలయ్య, కనకం రమేష్, బండారి దేవేందర్, నాగపూరి శ్రీధర్, తోట రఘు, ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
