నిజామాబాద్ జీజీహెచ్‌కు మరో ఘనత..
నిజామాబాద్ జీజీహెచ్‌కు మరో ఘనత..
- తొలి ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్
- అత్యాధునిక వైద్య సేవల దిశగా మరో మైలురాయి
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది.ఆసుపత్రిలో తొలిసారిగా నిర్వహించిన పునర్నిర్మాణ శస్త్రచికిత్స విజయవంతమై ప్రభుత్వ వైద్య సేవల విస్తరణకు కొత్త దిశను చూపింది.గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ (45) అనే మహిళ ముఖం ఎడమ చెంప భాగంలో బేసల్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.వైద్య పరీక్షల అనంతరం ఆమెకు పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ శివాని ఆధ్వర్యంలో చర్మ పునర్నిర్మాణ ఫ్లాప్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

ఈ శస్త్రచికిత్సను శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో వైద్య బృందం సమన్వయంతో చేపట్టారు.శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉండి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇదే తొలి పునర్నిర్మాణ శస్త్రచికిత్స కావడం విశేషం.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతం అవుతోందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వి. నాగమోహన్ మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వైద్య బృందం కృషి చేస్తోందని తెలిపారు.తొలి పునర్నిర్మాణ శస్త్రచికిత్స విజయవంతం కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొంటూ వైద్యులు,నర్సింగ్ సిబ్బందిని అభినందించారు.
