Madapur Murder | మాదాపూర్‌లో యువకుడి హత్య

రామేశ్వరం కేఫే సమీపంలో ఘటన
యువతి తండ్రితో పాటు మరో వ్యక్తి దాడి చేసినట్లు అనుమానం
పోలీసుల అదుపులో నిందితులు

Madapur Murder | ఆంధ్ర‌ప్రభ వెబ్‌డెస్క్ : ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మాదాపూర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ (30)పై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. భాస్కర్‌పై కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు, పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, కౌన్సెలింగ్ అనంతరం కూడా పరిస్థితిలో మార్పు రాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల భాస్కర్ సవాల్ చేసేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి భాస్కర్‌పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం నిందితులిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై మాదాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వేధింపుల వివాదమే హత్యకు కారణమా? లేక ఇతర వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

భాస్కర్‌ను చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో భాస్కర్ కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. ఉప్పరపల్లి రోడ్డుపై కుటుంబసభ్యులు, ఎమ్మార్పీఎస్‌ నేతల ధర్నా చేస్తున్నారు. భాస్కర్‌ను చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.