జర్నలిస్టులకు రెయిన్‌కోట్లు పంపిణీ…
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెయిన్‌కోట్లను పంపిణీ చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎండలు, వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమయానుకూలంగా సమాచారాన్ని చేరవేస్తూ జర్నలిస్టులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. వర్షాకాలంలో వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించే మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా పరిపాలనకు మీడియా ఎల్లప్పుడూ సహకరిస్తోందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డీపీఆర్వో తిరుమల, డీపీవో మురళి, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సమాచార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
