డోన్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత

డోన్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత

రూ.14.01 లక్షల నగదు, కారు, 45 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14.01 లక్షల నగదు, మారుతి సుజుకి స్విఫ్ట్ కారు, 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

రుద్రాక్షగుట్ట వద్ద అనుమానాస్పద కదలికలు
డోన్ ప్రాంతంలోని గుత్తి రోడ్డులో రుద్రాక్షగుట్ట సమీపంలో డీఎల్ 1సీ క్యూ 9769 నంబర్ గల మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వీరంతా అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందినవారిగా తేలిందని ఎస్పీ తెలిపారు.

సిగరెట్ గోడౌన్ చోరీ కేసు వెలుగులోకి
ఈ ఏడాది ఏప్రిల్ 20న నంద్యాల జిల్లా డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ సిగరెట్ గోడౌన్‌లో భారీ ఎత్తున సిగరెట్ బండిళ్లను చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. చోరీ చేసిన సరుకును హైదరాబాద్‌లో విక్రయించి, వచ్చిన నగదును తమ వద్దే ఉంచుకున్నట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు.

కడప, తెలంగాణ, కర్ణాటకలోనూ చోరీలు
కడపతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో నలుగురు వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు తెలిసిందని ఎస్పీ చెప్పారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఇంతియాజ్ బాషా, రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు
అరెస్ట్ అయిన నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. పాళీ జిల్లా హస్పాట్ గ్రామానికి చెందిన కుమావత్ లక్ష్మణ్ రామ్‌పై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 8 కేసులు నమోదై ఉన్నాయన్నారు.

రాజస్థాన్ రాష్ట్రం బంజాకూరి గ్రామానికి చెందిన ఘన్ శ్యామ్ అలియాస్ ఘన్ పత్‌పై 4 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. అదే రాష్ట్రంలోని బీరోల్ గ్రామానికి చెందిన మాణిక్ చంద్‌పై 8 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

పోలీసులకు ఎస్పీ అభినందనలు
నిందితులపై గతంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోనూ పలు కేసులు ఉన్నట్లు పరిశీలనలో తేలిందని ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ సునీల్ షొరాణ్ అభినందించారు.