అన్నవరంలో పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల అమలు

అన్నవరంలో పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల అమలు

కాకినాడ, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైయున్న శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు సత్యదేవా! మొరవినవా అని గగ్గోలు పెడుతున్నారు. నగదురహిత లావాదేవీలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..

గతనెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తదుపరి ముఖ్యమంత్రి కార్యదర్శి ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో పూర్తిగా నగదురహిత లావాదేవీలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఆ మేరకు ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంను ఎంపికచేశారు. అందులో భాగంగా దేవాదాయశాఖ కమీషనర్ కోడూరి రామచంద్రమోహన్ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు.

ఆ ఆ ప్రకారం దేవస్థానంలో నిర్వహించే వ్రతములు, స్వామివారి దర్శనములు, ఇతర ఆర్జితసేవలు, ప్రసాదం కొనుగోలు, కేశఖండన తదితర వాటికోసం తీసుకొనే టికెట్ కౌంటర్లను పూర్తిగా తీసివేయాలని ఆదేశించారు. భక్తులు మనమిత్ర వాట్సాప్ ద్వారా, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా లేదా దేవస్థానంపై ఏర్పాటుచేసిన కియోస్క్ మిషన్ల ద్వారా మాత్రమే ఆయా టికెట్లను పొందాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. గడచిన వారం రోజులుగా ఆ ఉత్తర్వుల అమలులో భాగంగా నగదు ద్వారా టికెట్లను రత్నగిరిపై పూర్తిగా నిషేధించారు. దాంతో భక్తులు తమ అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.

రత్నగిరికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వారిలో అత్యధికులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఉంటారు. వారిలో ఎక్కువమందికి నగదురహిత, డిజిటల్ లావాదేవీలపై అంత అవగాహన లేకపోవడంతో అటువంటి వారు ఈ విధానంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఒకవేళ ఫోన్ ద్వారా ఈ చెల్లింపులు చేద్దామనుక సున్నా సిగ్నల్స్ సరిగా లేకపోవడం, ఏర్పాటుచేసిన కియోస్క్ మిషన్లు సైతం సాంకేతిక కారణాలతో మొరాయించడంతో వారు ఎంతో అసౌకర్యానికి గురౌతున్నారు. దాంతో ఏంచేయాలో తెలియక అక్కడ ఉన్న క్రిందిస్థాయి సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. తిరుమల తిరుపతి లాంటి అతిపెద్ద దేవస్థానంలో కూడా డిజిటల్ ఆన్లైన్ పేమెంట్లతో పాటు సమాంతరంగా నగదు చెల్లింపులను అనుమతిస్తుండగా ఇక్కడ ఈ విధంగా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సరిఅయిన పరిశీలన ఒక్కసారిగా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు తమని బాధ్యులను చేయడం సరికాదని భక్తులు వాదిస్తున్నారు. ఇలాఉండగా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు గర్భగుడిలోకి సెల్ఫోన్ నిషేధం ఉండటంతో చాలా మంది తాము తీసుకున్న సత్రం గదులలోను, కొండపైకి వచ్చిన వారి వాహనంలోను తమ ఫోన్లను విడిచి వస్తున్నారు. తీరా టికెట్ కోసం వచ్చేసరికి నగదు చెల్లింపులు లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురౌతున్నారు. అసలు అన్నిటి కన్నా ముఖ్యంగా పూర్తిగా నగదు చెల్లింపులను నిలిపివేయడం ఏంటి? అని భారత ప్రభుత్వం ద్వారా ముద్రితమైన కరెన్సీని తీసుకోమంటూ ఎలా అంటారని భక్తులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

మరి అలాంటప్పుడు స్వామివారి హుండీలలో మాత్రం నగదును ఎలా అనుమతిస్తారని వారు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అత్యంత ధనికమైన, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల విధానం లేదనీ అలాంటిది గ్రామీణ, వ్యవసాయాధారితమైన వ్యక్తులు అధికంగా ఉండి, వారు దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో వస్తే ఇక్కడ అధికారులు తీసుకున్న ఇలాంటి అసందర్భ, అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం సనాతన ధర్మం పైనే ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుందని పలువురు భక్తులు పేర్కొంటున్నారు।