శ్రీవారి దర్శనం పేరుతో మోసం..

శ్రీవారి దర్శనం పేరుతో మోసం..
- భక్తుల నుంచి రూ.65 వేలు వసూలు చేసిన నకిలీ టీటీడీ ఉద్యోగి అరెస్ట్
- సోషల్ మీడియా, ఫోన్ కాల్స్‌తో వల
- పల్నాడు జిల్లాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రూ.45 వేలు నగదు, మొబైల్, బ్యాంక్ పాస్‌బుక్కులు స్వాధీనం
- అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని ఎస్పీ హెచ్చరిక
తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ ఐపీఎస్., పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈ చర్యలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన బొడపాటి నవీన్ చౌదరి (33) సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఎంప్లాయీస్ కోటాలో శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను నమ్మించేవాడు.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో పని చేస్తున్న సూర్యకళ అనే మహిళను నమ్మించి, ఈ ఏడాది మార్చిలో ఆరుగురికి శ్రీవారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి పలు దఫాలుగా యూపీఐ ద్వారా రూ.47 వేలు, తిరుమలకు వచ్చిన తర్వాత మరో రూ.18 వేలు నగదు తీసుకుని మొత్తం రూ.65 వేలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఎలాంటి దర్శనం టికెట్లు ఏర్పాటు చేయకుండా మోసం చేసినట్లు విచారణలో తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల II టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పల్నాడు జిల్లాలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.45 వేలు నగదు, ఒక రెడ్మీ మొబైల్ ఫోన్, రెండు బ్యాంక్ పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లోని యూపీఐ లావాదేవీలను పరిశీలించగా బాధితుల నుంచి డబ్బులు బదిలీ అయిన వివరాలు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
అలాగే నిందితుడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా దాదాపు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 2021 నుంచి 2026 మధ్య గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో నిందితుడిపై నాలుగు చీటింగ్ కేసులు నమోదై విచారణ ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతని గత నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దర్శనం టికెట్లు, వసతి, ప్రత్యేక ప్రవేశం పేరుతో సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దని భక్తులకు సూచించారు. శ్రీవారి దర్శనం, వసతి టికెట్లు కేవలం అధికారిక టీటీడీ వెబ్సైట్ మరియు అనుమతించబడిన కేంద్రాల ద్వారానే పొందాలని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
