మానవ రహిత ఎయిర్ ట్యాక్సీతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

మానవ రహిత ఎయిర్ ట్యాక్సీతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: గుంటూరు ప్రజలకు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అత్యవసర సమయాలు, అనుకోని అగ్నిప్రమాదాలు సంభవించినపుడు, మెడికల్ అత్యవసర పరిస్థితుల్లో మానవ రహిత విమానం అందుబాటులోకి రానుంది. గుంటూరు చెందిన యువ ఇంజనీర్ అభిరాం చావా కృషి ఫలితంగా త్వరంలో ఎయిర్ ట్యాక్సీ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి గుంటూరు నగరశివారు నల్లచెరువులో గురువారం నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం అయ్యాయి.

అభిరాం అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తిచేశారు. ఎయిర్ ట్యాక్సీల తయారీవైపు ముందడుగు వేశారు. 2019లో నల్లచెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను నెలకొల్పారు. ప్రజల అవసరాలకు, వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలపై పరిశోధనలు చేశారు. చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. రన్వే అవసరం లేని కొత్తరకం ఎయిర్ క్రాఫ్ట్స్ దీనిని అభివర్ణించారు.

ఈ సందర్భంగా మాగ్నమ్ వింగ్స్ ఎండి అభిరామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా వి2 2.0 ఎయిర్ ట్యాక్సీ సిద్దమైనట్లు తెలిపారు. ఈ వాహనాన్ని ప్యాసింజర్ ట్రావెల్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ ఫైటర్, కార్గో ఇలా నాలుగు విధాలుగా వినియోగించుకోవచ్చని అన్నారు. వి2 2.0 ఎయిర్ ట్యాక్సీలో సింగిల్ ప్యాసింజర్ ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ట్యాక్సీ తయారీలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, దీనిలో మొత్తం 8 మోటార్లుంటాయన్నారు. ఏవైనా రెండు మోటార్లు ఫెయిల్ అయినా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వొచ్చని వివరించారు.

150 కేజీల బరువుతో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేట్యాక్సీ ముప్పై కిలో మీటర్ల వరకూ వెళ్లి రావచ్చన్నారు. ఈ వాహనంలో రాడార్, లాడార్, కెమెరాలు ఉంటాయని, జీపీఎస్ అనుసంధానంతో వాహనం ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణ మధ్యలో పక్షులు వంటివి ఎదురైన వెంటనే అలెర్ట్ చేస్తుందన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రయాణించేలా రూపొందించామన్నారు. సింగిల్ ప్యాసింజర్తో పాటు ముగ్గురు ప్రయాణించే వాహనం డిజైన్ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే మానవ రహిత ప్రయాణ ప్రయోగం చేస్తామన్నారు. అయితే కేంద్ర పాలసీ ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది చివరికి అన్నీ అనుమతులు వచ్చి ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాధ్యమవుతాయన్న ఆశాభావాన్ని అభిరామ్ చావా వ్యక్తం చేశారు.

Leave a Reply