AP | సమస్యల లోగిళ్లు అంగన్వాడీ కేంద్రాలు…

ప్రత్యేక అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన దిగ్భ్రాంతికర వాస్తవాలు…
చాలాచోట్ల అద్దె భవనాలు దిక్కు
తాగునీరు, మరుగుదొడ్లు కరువే
జర్నీపల్లెలో పాములు కూడా వస్తున్నాయి
చిన్నారుల సంక్షేమానికి పెద్ద ఎత్తున గండం


AP | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ముక్కు పచ్చలారని చిన్నారులు చదువుకునే అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు నిర్వహించిన తనిఖీలు ఈ విషయాలను స్పష్టం చేశాయి. 23 మండలాల్లో జరిగిన తనిఖీల్లో సొంత భవనాలు లేక అద్దె ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోనే కేంద్రాలు కొనసాగుతుండటం, అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణాలు, తాగునీటి కొరత, మరుగుదొడ్లు లేకపోవడం, కాంపౌండ్ వాల్లు లేక చిన్నారుల భద్రత ప్రమాదంలో పడటం, యాక్టివిటీ పుస్తకాలు, బాలసంజీవని కిట్లు అందకపోవడం, పోషకాహార నాణ్యతపై ఫిర్యాదులు, ప్రీ-స్కూల్ కార్యకలాపాల్లో నిర్లక్ష్యం, పిల్లల హాజరు తగ్గిపోవడం వంటి ఎన్నో లోపాలు ఒకేసారి బయటపడడం జిల్లా యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలే ప్రస్తుతం సమస్యల నిలయాలుగా మారిన దృశ్యం ప్రత్యేక అధికారుల నివేదికల్లో ప్రతిబింబించింది.

సొంత భవనాల కొలత…
తనిఖీల్లో అత్యంత ఎక్కువగా కనిపించిన సమస్య సొంత భవనాల కొరత. బంగారుపాళ్యం మండలంలోని మొగిలివెంకటగిరి కమ్యూనిటీ సెంటర్‌లో కొనసాగుతుండగా, మొగిలి కేంద్రం శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో నడుస్తోంది. ఇందిరమ్మ కాలనీలో రెండు కేంద్రాలను విలీనం చేసి నిర్వహిస్తున్నారు. బైరెడ్డిపల్లి-3, బేలుపల్లి-1 కేంద్రాలకు భవనాలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. చెర్లోపల్లి, చిన్నమనాయనిపల్లి, కుప్పం-2, కుప్పం-2, టీబీ రోడ్, అర్బన్ కాలనీ, డీకేపల్లి, ఎంఎస్‌వీఎం పురం, వి.ఆర్.కుప్పం, కనమలదొడ్డి, కంచిదాసనపల్లి, సగినేపల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ అద్దె భవనాలు, పాత పాఠశాలలు లేదా ఉచిత భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలమనేరు రూరల్‌లో 2018-19లో మంజూరైన భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండిపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐరాల మండలంలోని చిగరపల్లిలో 2018లో ప్రారంభమైన భవన నిర్మాణం బేస్‌మెంట్ దశలోనే ఆగిపోవడం ప్రభుత్వ పనుల నత్తనడకకు నిదర్శనంగా నిలిచింది.

తాగునీటి సమస్య…
తాగునీటి సమస్య కూడా జిల్లాలోని అనేక కేంద్రాలను వెంటాడుతోంది. బంగారుపాళ్యం శేష్‌పురంలో కొత్త ఆర్వో ప్లాంట్ అవసరమని, చిత్తూరు రూరల్‌లోని కమ్మపల్లిలో ఆర్వో సదుపాయం లేదని, గంగావరం రెంటికుంటలలో మోటార్, ఫిల్టర్ రెండూ పనిచేయడం లేదని, గుడిపాలలోని 189 కొత్తపల్లి, చీలాపల్లి కేంద్రాల్లో తాగునీటి సదుపాయం లేకపోవడంతో పాటు ఉన్న ఆర్వో కూడా పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. కుప్పం అర్బన్ వడ్డిపల్లి, అర్బన్ కాలనీ, నిండ్ర కొప్పేడు, పలమనేరు దుగ్గినవారిపల్లె, పెనుమూరు రామకృష్ణాపురం కేంద్రాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

మరుగుదొడ్లు లేవు…
మరుగుదొడ్లు, వంటగదులు లేకపోవడం అనేక కేంద్రాల్లో చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గుడుపల్లె మిద్దూరులో మరుగుదొడ్డి లేక పిల్లలు పొరుగింటికి వెళ్లాల్సి వస్తుండగా, మోడల్ కాలనీ, డీకేపల్లి, పల్లి చెరువు, మల్లసముద్రం, ఎగువ పునేపల్లి, మొగిలివెంకటగిరి, ఆముదాల పుత్తూరు వంటి కేంద్రాల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, వంటగదులు లేకపోవడం బయటపడింది.

ప్రహరీ గోడలు లేవు
చిన్నారుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. బైరెడ్డిపల్లి, గంగావరం, గుడిపాల, శాంతిపురం, రామకుప్పం తదితర మండలాల్లోని అనేక కేంద్రాలకు కాంపౌండ్ వాల్లు లేవు. బి.జి.మిట్టూరు కేంద్రం జాతీయ రహదారి పక్కనే రక్షణ గోడ లేక కొనసాగుతుండగా, బండకిందపల్లి ఎస్సీ కాలనీ కేంద్రం అడవి ప్రాంతంలో ఒంటరిగా ఉంది. రామకుప్పం జెర్నిపల్లిలో తలుపు కింద ఉన్న ఖాళీ గుండా ఇటీవలే పాము కేంద్రంలోకి వచ్చిన ఘటనను అధికారులు నమోదు చేశారు. 197 రామాపురంలో కోతుల బెడదతో వరండాకు గ్రిల్స్ అవసరమని సూచించారు. తిరునాంపల్లిలో చెరువు సమీపంలో ఉండటంతో వర్షాకాలంలో పిల్లలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

అందని విద్యా సామగ్రి, పోషకాహారం
పిల్లలకు అందాల్సిన విద్యా సామగ్రి, పోషకాహారం సరఫరాలోనూ తీవ్ర లోపాలు బయటపడ్డాయి. గుడిపాల, పూతలపట్టు మండలాల్లోని మొత్తం 18 కేంద్రాలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన యాక్టివిటీ పుస్తకాలు అందలేదు. ఐరాల మండలంలోని ఏడు కేంద్రాల్లో బాలసంజీవని కిట్లు నెలల తరబడి ఆలస్యంగా వస్తున్నాయని అధికారులు గుర్తించారు. మొగిలిమిట్టూరు, గంగవరం కొత్తపల్లి కేంద్రాల్లో బాలసంజీవని కిట్ల నాణ్యతపై తల్లులు ఫిర్యాదులు చేశారు. బి.జి.మిట్టూరులో గుడ్ల నాణ్యత బాగా లేదని, వెణుతానపల్లి, ముత్తిరేవులలో గుడ్ల రికార్డులు పంపిణీతో సరిపోవడం లేదని తనిఖీల్లో తేలింది. బైరెడ్డిపల్లిలో గుడ్ల కలర్ కోడింగ్ నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ముసలయ్యగారిపల్లిలో పిల్లలకు తయారుచేసే ఆహారంలో పామ్ ఆయిల్ వాడకూడదని తల్లిదండ్రులు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు.

పిల్లల హాజరు అంతంత మాత్రమే…
ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాల అమలు కూడా అనేక చోట్ల ప్రశ్నార్థకంగా మారింది. చిత్తూరు రూరల్‌లోని పియాన కండ్రిగ, తుమ్మింద, పెద్దశెట్టిపల్లి, జెర్రిమడుగులో పిల్లల నమోదు చాలా తక్కువగా ఉండగా, రొంపిచర్ల మండలంలోని బయ్యపురెడ్డి అగ్రిపల్లి, కుమ్మరపల్లి, పెద్దగొట్టిగల్లు, బండకిందపల్లి ఎస్సీ కాలనీలో పిల్లల హాజరు అత్యంత తక్కువగా నమోదైంది. మేకలవారిపల్లిలో తనిఖీ సమయంలో ఒక్క చిన్నారి కూడా లేకపోవడం, మోటమల్లెలలో కేంద్రం పూర్తిగా మూసివేసి ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. కుప్పం ఆర్కేఎం నగర్ కేంద్రంలోనూ పిల్లలు ఎవరూ హాజరు కాలేదు.

కనిపించని కిచెన్ గార్డెన్లు…
కిచెన్ గార్డెన్ల నిర్వహణలోనూ భారీ నిర్లక్ష్యం బయటపడింది. గుడిపాల, కార్వేటినగరం, పెద్దపంజాణి, కుప్పం, జీడీ నెల్లూరు తదితర మండలాల్లోని అనేక కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు లేకపోవడం లేదా పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడం గుర్తించారు. రికార్డుల నిర్వహణలో కార్వేటినగరం, కుప్పం వడ్డిపల్లి కేంద్రాల్లో లోపాలు కనిపించగా, అంబేద్కర్ నగర్‌లో వాష్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటం, ఎన్టీఆర్ కాలనీలో ఆవరణ శుభ్రత లేకపోవడం కూడా అధికారులు నమోదు చేశారు. కార్వేటినగరం కెఎం పురం, కుప్పం ఆర్కేఎం నగర్, పూతలపట్టు నాథంపల్లిలో హెల్పర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో కేంద్రాల నిర్వహణపై ప్రభావం పడుతోంది.

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారులు సమర్పిస్తున్న నివేదికలు అంగన్వాడీ కేంద్రాల అసలు పరిస్థితిని యథాతథంగా బయటపెడుతున్నాయి. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్యకు కేంద్ర బిందువులుగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ప్రస్తుతం మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా నిర్లక్ష్యం, నాణ్యతలేని సేవలు, అసంపూర్తి నిర్మాణాలు, భద్రతా లోపాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయనే విషయం ఈ తనిఖీలు స్పష్టంగా చాటుతున్నాయి. ప్రత్యేక అధికారుల నివేదికల ఆధారంగా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు వేలాది మంది చిన్నారుల భవిష్యత్తును నిర్ణయించబోతోంది.