పంద్రాగస్టుకూ పాత యూనిఫాంలేనా..?
కొత్త దుస్తుల కోసం సుమారు 3 వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు
వెల్గటూర్, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫాంలు ఇప్పటికీ అందకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా యూనిఫాంల పంపిణీ పూర్తికాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మండలంలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూర్బా బాలికల విద్యాలయంలో మొత్తం 2,385 మంది విద్యార్థులు, బీసీ గురుకుల బాలుర పాఠశాలలో 455 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా సుమారు 3 వేల మంది విద్యార్థులు కొత్త యూనిఫాంల కోసం ఎదురుచూస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో కనీసం ఆగస్టు 15 నాటికైనా కొత్త యూనిఫాంలు అందుతాయా అనే సందేహం తల్లిదండ్రులను వెంటాడుతోంది. ప్రతి ఏడాది కొత్త యూనిఫాంలతో జాతీయ పండుగ వేడుకల్లో పాల్గొనే విద్యార్థులు ఈసారి కూడా పాత యూనిఫాంలతోనే హాజరుకావాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేవని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూనిఫాంల పంపిణీ ఇంకా పూర్తికాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
“అన్నీ బాగున్నాయంటున్నారు… మరి యూనిఫాంలు ఎక్కడ?” అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల అవసరాల విషయంలో అధికారులు వెంటనే స్పందించి యూనిఫాంల పంపిణీని వేగవంతం చేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి కొత్త యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
