యూడీఎఫ్ విజయంపై రేవంత్ రెడ్డి ప్రశంసలు
యూడీఎఫ్ విజయంపై రేవంత్ రెడ్డి ప్రశంసలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధారణం కాదని, కష్టపడి సాధించిన గొప్ప ఫలితంమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్ మున్షీ నాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వారి మార్గదర్శకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణంమని తెలిపారు. కేరళలో జరిగిన ప్రచారంలో ప్రజలు తనపై చూపిన ప్రేమ, ఆత్మీయతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అనుబంధం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఎదురైన నిరాశ తర్వాత ఇప్పుడు మంచి భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయి అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేరళ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంమని, భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేరళ ప్రజలు ప్రతిబింబించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రచారం సందర్భంగా తనపై ప్రేమ కురిపించిన యూడీఎఫ్ మద్దతుదారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నారు.
కేరళ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్పూర్తి గలవారని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిని విశ్వసిస్తాయని, దశాబ్దంపాటు నిరాశ, ద్రోహం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గొప్ప భవిష్యత్తు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అక్కడి అధికార సీపీఎంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం పినరయి విజయన్ కూడా రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ భవిష్యత్తు ఆశాజనకమేనని ధీమా వ్యక్తం చేశారు.
కేరళలో విజయం దేశవ్యాప్తంగా మార్పుకు సంకేతం: మహేష్ కుమార్ గౌడ్
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సాధించిన ఘన విజయం దేశ రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతంమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 140 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 100 సీట్లు సాధించడం చారిత్రాత్మక విజయంమని అభివర్ణించారు.
ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, నాయకులు నిర్వహించిన ప్రచారం గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని ప్రజలను కోరడం ఓటర్లను ఆకట్టుకుందని పేర్కొన్నారు. కేరళ ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని నింపాయని, రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ విజయం సాధించడంపై ఆయన అభినందనలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో టీఎంసీ అనుకూల ఓట్లను తొలగించడం, వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను సమీక్షించి ఇండియా కూటమి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు.
