వల్లాపురంలో తల్లిపాల వారోత్సవాల ప్రారంభం
నడిగూడెం (ఆంధ్రప్రభ): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని వల్లాపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్ కేసగాని సరిత లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని, ముర్రుపాలు బంగారం కంటే విలువైనవని పేర్కొన్నారు. తల్లిపాల వల్ల చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఎం. కరుణలత, విద్యా కమిటీ చైర్మన్ మైనంపాటి ఉపేంద్రమ్మ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు షేక్ మహబూబ్, నూకపొంగు గోవిందమ్మ, అంగన్‌వాడీ ఆయా, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
