శిలాఫలకానికే రెండేళ్లు..

పూర్తి కాని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం

కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నిరసన
అభివృద్ధి పేరుతో శిలాఫలకాలకే ప్రభుత్వం పరిమితమైందని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపణ

వికారాబాద్ (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఫోర్ సూట్స్ రెస్ట్ హౌస్ నిర్మాణానికి 2024 ఆగస్టు 5న శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బుధవారం శిలాఫలకం వద్ద కేక్ కట్ చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైందని, పనులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు కనిపించడం లేదని ఆరోపించారు. రోడ్లు, భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల కంటే శిలాఫలకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతుబంధు అధ్యక్షుడు రామ్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కమల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, భాస్కర్, షఫీ, శ్రీనివాస్‌రెడ్డి, గిరీష్, భూపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.