ముస్తఫాపై కేసు రాజకీయ కక్షసాధింపే

  • వైఎస్సార్సీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా
  • బాధితులనే నిందితులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ
  • మైనారిటీలపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని విమర్శ

విజయవాడ, ఆంధ్రప్రభ: వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకుడు, గుంటూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త ముస్తఫా, ఆయన కుమారుడిపై నమోదైన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా ఆరోపించారు.

పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ మైనారిటీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసలు బాధితులనే నిందితులుగా చిత్రీకరిస్తూ కేసులు నమోదు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితం, రాజకీయాల్లో సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకున్న ముస్తఫా కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించడం సమంజసం కాదని పేర్కొన్నారు.

సాధారణ వ్యాపార వివాదానికి రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బాజీ బాబా విమర్శించారు. రాష్ట్రంలో మైనారిటీలు వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న మద్దతును చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ కుట్రలకు వైఎస్సార్సీపీ భయపడదని, ప్రజల అండతో చట్టపరంగాను, ప్రజాస్వామ్యబద్ధంగాను చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని బాజీ బాబా స్పష్టం చేశారు.