చింతల్‌బస్తీపై ఎమ్మెల్యే ఫోకస్
మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలపై ఆరా
అచ్చంపేట (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలోని నాలుగో వార్డు చింతల్‌బస్తిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హామీ ఇచ్చారు. బుధవారం మార్నింగ్ వాక్‌లో భాగంగా మున్సిపల్ చైర్మన్‌తో కలిసి చింతల్‌బస్తిలో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర అంశాలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అచ్చంపేట పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని, అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
