ఆయకట్టుకు నీళ్లివ్వాలి
రైతులను ఆదుకోవాలి: రితేష్
కడెం (ఆంధ్రప్రభ): కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి కడెం ప్రాజెక్టును సందర్శించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేకపోవడంతోనే ఎల్‌నినో ముప్పును సాకుగా చూపిస్తూ రైతులను ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించడం సరికాదని విమర్శించారు.
కడెం ప్రాజెక్టు ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో పూర్తిస్థాయిలో నిండిపోయిందని, ఆయకట్టు ప్రాంత భూములు వరి సాగుకు అత్యంత అనుకూలమని రితేష్ రాథోడ్ పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాల సరఫరాపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో విఫలమైందని ఆరోపించారు. వెంటనే కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయడంతో పాటు వరి ధాన్యం కొనుగోలు ప్రణాళికలను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తన్న, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
