బస్టాండ్‌లో భలే తిప్పలు.. ప్రయాణికులకు ఇక్కట్లు
వర్షపు నీరు నిల్వతో బురదమయం..
పారిశుద్ధ్యంపై చర్యలు కోరుతున్న ప్రయాణికులు
హనుమకొండ, ఆంధ్రప్రభ: హనుమకొండ బస్టాండ్‌లో అపరిశుభ్రత, వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ ఆవరణలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో చెరువును తలపించే పరిస్థితి ఏర్పడింది.
బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయాణికులు బురద, నిల్వ నీటిని దాటాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు.
మురుగు నీటి పారుదల సక్రమంగా లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద కూడా పెరిగిందని ప్రయాణికులు తెలిపారు. ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన బస్టాండ్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిల్వ నీటిని వెంటనే తొలగించడం, పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రయాణికులు, స్థానికులు సంబంధిత అధికారులు, టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు.
