ఉత్సాహంగా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్ పోటీలు

హాకీ, అథ్లెటిక్స్ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ: ఎన్‌టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా జ‌రుగుతున్నాయి. బుధవారం విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ మున్సిపల్ స్టేడియంలో జ‌రిగిన హాకీ, అథ్లెటిక్స్ పోటీల‌తో పాటు జిల్లా జట్టు ఎంపిక పోటీల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ ప‌రిశీలించారు. క్రీడాకారులతో ముచ్చటించి పోటీలు జ‌రుగుతున్న తీరుపై అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు.

పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. పోటీల నిర్వహణ, క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలు, మైదాన ఏర్పాట్లపై కలెక్టర్ ల‌క్ష్మీశ డీఎస్ఏ అధికారుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. పోటీలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల‌ని ఆదేశించారు.

జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా జట్టుకు ఎంపిక చేయడం పోటీల ప్రధాన ఉద్దేశ‌మ‌ని తెలిపారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో జులై 15 నుంచి ఆగ‌స్టు 26 వ‌ర‌కు అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలు జ‌రుగుతున్నాయి. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు జ‌రుగుతున్నాయి. కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, డీఎస్‌డీవో కె.కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.