అటవీ అధికారులపై కేసు నమోదు చేయాలని రాస్తారోకో

ఆదివాసీల ఆందోళన.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌తో పాటు ఇతర అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ 9 ఆదివాసీ తెగల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆదివాసీ నాయకుల కథనం ప్రకారం.. నాయకపుగూడకు చెందిన మూతి మల్లేష్, శ్రీను, అనిల్, చంటి, శివలు చేపలు పట్టేందుకు ఇందన్‌పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లగా, రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో పాటు ఇతర అటవీ అధికారులు వారిపై లాఠీలతో దాడి చేశారని ఆరోపించారు.

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రాష్ట్ర హైవేపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న, కార్యదర్శి తట్ర భీమ్రావు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం జంగు, పీవీటీజీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కె. తిరుపతి, నాయకులు బాపు తదితరులు పాల్గొన్నారు.