డీఎస్సీలో అక్రమాలను నిగ్గు తేల్చండి..

  • ఈనెల 6 నుంచి 9 వరకు రిలేదీక్షలు
  • 10వ తేదీన నియోజకవర్గాల్లో ర్యాలీలు
  • బాధ్యతవహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి
  • టీచర్‌ పోస్టుల భర్తీపై తక్షణం సీబీఐ విచారణ చేయించాలి
  • వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌

అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వైసీపీ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంఓ తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు జతకట్టి ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ తో పాటు అనేక హామీలను గుప్పించారని గుర్తు చేశారు.

యువతకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు. లేనిపక్షంలో ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సి పేరుతో పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని విమర్శించారు. తమకు కావాల్సి వారి కోసమే జీవోలను సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. తక్షణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా డీఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో యువతకు చెప్పిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువతకు చేస్తున్న అన్యాయాలను ఖండిస్తూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7,8,9 వ తేదీల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహారదీక్షలతో పాటు ఈ నెల 10వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు మద్దతుగా వైయస్సార్‌ సీపీ చేపట్టబోతున్న రిలే నిరాహారదీక్షలు, నిరసన ర్యాలీకి పార్టీ శ్రేణులతో పాటు మేధావులు, విద్యావంతులతో పాటు పెద్ద ఎత్తున యువతీయువకులు, విద్యార్థులు, రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.