కవ్వాల్ టైగర్ జోన్లో ఎకో సెన్సిటివ్ పరిధి తగ్గింపునకు ప్రతిపాదనలు
జన్నారం, ఆంధ్రప్రభ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్‌ను 10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్‌కు తగ్గించాలని ప్రతిపాదనలు పంపినట్లు మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. జన్నారం అటవీ శాఖ విశ్రాంతి భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత నిబంధనల కారణంగా గోదావరి నది నుంచి స్థానిక అవసరాల కోసం కూడా ఇసుక వినియోగానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తగ్గింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే స్థానిక అవసరాల కోసం గోదావరి ఇసుక వినియోగానికి అటవీ శాఖకు ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టే బాధ్యత మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు అటవీ శాఖపై కూడా అధికంగా పడుతోందని తెలిపారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించి అవసరమైన అనుమతులు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారులు బాబా ఖాదర్ వలీ, గోదారి లక్ష్మీనారాయణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
