Nature-Wonder-Tilapia : అద్భుత మాతృత్వం Andhra Prabha Top Story

Nature-Wonder-Tilapia : అద్భుత మాతృత్వం Andhra Prabha Top Story

  • ఆ ఛైనా గుర‌క‌ సొంతం
  • నోటిలోనే పిల్లలకు ఆల‌నాపాల‌న‌
  • అమ్మ నోటిలోనే బిడ్డ‌ల‌కు సురక్షితం
  • ప్రకృతి ప్రసాదం ఈ మౌత్ బ్రూడింగ్
  • శత్రువుల నుంచి అపూర్వ రక్షణ

(మండవల్లి , ఆంధ్రప్రభ):

Nature-Wonder-Tilapia : చేపలు గుడ్లు పెట్టి వాటిని నీటిలో వదిలేస్తాయనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే తిలాపియా(చైనా గురక) చేప మాత్రం ఇతర చేపలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైన మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. తిలాపియా చేప నోటి నుంచి పిల్లలు పుట్టవు. కానీ గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేప పిల్లలను కొంతకాలం పాటు తన నోట్లోనే సంరక్షించడం దీని విశిష్ట లక్షణం. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా “మౌత్ బ్రూడింగ్ అని పిలుస్తారు.


తిలాపియా ఆడ చేప గుడ్లు పెట్టిన వెంటనే వాటిని తన నోటిలోకి తీసుకుంటుంది. అనంతరం మగ చేప విడుదల చేసే వీర్యకణాలతో ఆ గుడ్లు ఫలదీకరణం చెందుతాయి. ఆ తర్వాత గుడ్లు తల్లి చేప నోటిలోనే సురక్షితంగా అభివృద్ధి చెంది కొద్ది రోజుల్లో చిన్న చేప పిల్లలుగా మారుతాయి.


పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాటి రక్షణ బాధ్యతను తల్లి చేప వదిలిపెట్టదు. ప్రమాదం అనిపించిన ప్రతిసారీ చిన్న చేపలు వెంటనే తల్లి నోటిలోకి చేరి దాక్కుంటాయి. పరిస్థితి సురక్షితంగా మారిన తర్వాత మళ్లీ బయటకు వచ్చి ఆహారం కోసం సంచరిస్తాయి.